- నాగార్జునసాగర్‌లో వరుణ యాగం
- పూర్ణాహుతిలో సీఎం రేవంత్‌రెడ్డి
- సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్ష
- వరుణ యాగం పూర్ణాహుతిలో సీఎం దంపతులు
- ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రులు
- సాగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం
నాగార్జున సాగర్, నల్గొండ, వెలుతురు, ఆగష్టు 10:
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు, ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లో నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో సీఎం ఎ. రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాలతో వరుణదేవుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ వైదిక విధానంలో హోమక్రతువులు నిర్వహించారు. ఈ పవిత్ర యాగంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ఈ వరుణ యాగం నిర్వహించామని తెలిపారు. భారతీయ సంస్కృతిలో వర్షాలు కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయం. ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తూనే వర్షం, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహించాలని వేడుకున్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి కృష్ణా గోదావరి నదులు నిండుగా ప్రవహించి, నాగార్జునసాగర్, శ్రీశైలంలతో పాటు అన్ని ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవాలని కోరుకున్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి వరుణ దేవుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవ రావు, పి. సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు పాల్గొన్నారు.













