- గాంధీ మార్చురీలో ప్రియాంకకు నివాళులు
- ప్రియాంక తండ్రిని ఓదార్చిన మంత్రి శ్రీహరి
- ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం
- నిందితులకు కఠిన శిక్ష పడాలి
- సీఎం వెంటనే స్పందించారని వెల్లడి
- భవిష్యత్తులో ఘటనలు పునరావృతం కాకూడదు
హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 10:
రాజమండ్రి మెడికో ప్రియాంక మృతికి కారణమైనవారిపై కఠినంగా శిక్షించాలని రాష్ట్ర పశుసంవర్థక, క్రీడ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరించారు. గాంధీ ఆస్పత్రిలోని మార్చురీలో ప్రియాంక భౌతికకాయాన్ని మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు.
ప్రియాంకకు జరిగిన ఘటన అత్యంత విషాదకరమని మంత్రి వాకిటి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి తమతో పాటు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. కేసు దర్యాప్తు, తదుపరి చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా వ్యవహరించాలని సూచించారు.
చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని నిందితులు తప్పించుకోకుండా కఠినతరం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. నేరస్థులకు శిక్ష పడేలా చట్టపరమైన చర్యలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రియాంక కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
