- వనదేవతలకు ప్రత్యేక పూజలు
- ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థనలు
- సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
- అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
- క్యూ లైన్లు, పీటీ బీమ్స్ పరిశీలన
- మీడియా టవర్ల పనులపై ఆరా
- పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
మేడారం, వెలుతురు, ఆగష్టు 10:
మేడారంలోని సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణ పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని వనదేవతలను ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మేడారం ఆలయ అభివృద్ధి పనులతో పాటు భక్తుల సౌకర్యాల కోసం చేపడుతున్న క్యూ లైన్లు, పీటీ బీమ్స్, మీడియా టవర్ల నిర్మాణ పనులను సీతక్క పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఆలయ అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పాటు వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మేడారానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సమ్మక్క–సారలమ్మ వనదేవతల దర్శనానికి వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీతక్క పేర్కొన్నారు. సీఎం పర్యటన విజయవంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేసి అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.


