ఢిల్లీ, వెలుతురు, ఆగష్టు 10:
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే బిల్లు ప్రవేశపెట్టాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు.
మతం మారినంత మాత్రాన దళితులపై సామాజిక వివక్ష, కుల వివక్ష మారదని, ఎస్సీ హోదా సాధించే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, ప్రొ. గాలి వినోద్ కుమార్ తదితరులు స్పష్టం చేశారు.
