సర్దార్‌ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శం

  • వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుడు పాపన్న
  • ఈనెల 18న ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహ ఆవిష్కరణ
  • రవీంద్ర భారతిలో పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు
  • పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 10:

బహుజన విప్లవ వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ ఆశయాలను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ ప్రారంభానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పని చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఈనెల 18న రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గీతకార్మికులకు రక్షణగా కాటమయ్య రక్ష కిట్లను ప్రభుత్వం తరపున అందజేసినట్లు తెలిపారు. పాపన్న గౌడ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని, ఆయన చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు, ఆయన ఆశయాలను ఆచరించడమే నిజమైన నివాళి అని అన్నారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆసియా ఖండంలోనే తొలి చక్రవర్తిగా, బహుజన నాయకుడిగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి పాపన్న జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని జీఓతో పాటు ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు కొరకు స్థలాన్ని పరిశీలించి, రూ.3 కోట్లను కేటాయించామని తెలిపారు.

సామాజిక సమానత్వం, బహుజనుల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సర్వాయి పాపన్న ఆశయాలను నిలబెట్టుకోవాలంటే బహుజన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా సమన్వయంతో పోరాడాలన్నారు.

ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్, గౌడ సంఘాల నాయకులు బాలగోని బాలరాజ్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, అంబాలా నారాయణ గౌడ్, దుర్గయ్య గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మధూ సత్యం గౌడ్, రేవతి గౌడ్, బొనగాని యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.