- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- రేవంత్ బ్రదర్స్‌పై కేటీఆర్ విమర్శలు
- టెస్రాక్ట్ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు
- షెల్ కంపెనీల బాగోతం బయటపెడతామన్న కేటీఆర్
- కొండల్‌రెడ్డి పాత్రపై ప్రశ్నల వర్షం
- భూముల కేటాయింపుపై నిలదీత
- శ్రీధర్‌బాబుకు తెలియదా అని ప్రశ్న
- తిరుపతిరెడ్డి హోదాపైనా అనుమానాలు
- గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్న నేత
- ఓటర్ల జాబితాపైనా బీఆర్‌ఎస్ ఆందోళన
- జీఆర్ఎంబీపై ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరిక
హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 10:
టెస్రాక్ట్ సంస్థకు సంబంధించిన భూ కేటాయింపుల వ్యవహారాన్ని వదిలిపెట్టబోమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల పాత్రపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు. షెల్ కంపెనీల వ్యవహారాన్ని బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. టెస్రాక్ట్ సంస్థ, భూముల కేటాయింపు, ప్రభుత్వ పెద్దల సంబంధాలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
టెస్రాక్ట్ సంస్థకు అనుముల కొండల్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్నట్లు ఆయనే చెప్పుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటప్పుడు మంత్రి శ్రీధర్‌బాబు ఆ సంస్థతో కొండల్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. సంస్థలో ఒక్క ఉద్యోగి కూడా లేరని, కేవలం రూ.లక్షతో ఏర్పాటైనట్లు చెబుతున్న కంపెనీకి భారీ విలువైన భూములు ఎలా కేటాయించారని నిలదీశారు.
రూ.2 వేల కోట్ల విలువైన భూమిని రూ.7 వేల కోట్లకు కేటాయించారంటూ కేటీఆర్ ఆరోపించారు. ఈ భూ కేటాయింపుల వెనుక ఉన్న పూర్తి వ్యవహారాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు సూటు, బూటు వేసుకుని కంపెనీలు ఎలా ఏర్పాటు చేశారో కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
తన శాఖలో జరుగుతున్న వ్యవహారాల గురించి మంత్రి శ్రీధర్‌బాబుకు తెలియదా? లేక ముఖ్యమంత్రి ఒత్తిడికి తలొగ్గుతున్నారా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కొండల్‌రెడ్డికి టెస్రాక్ట్‌తో సంబంధం లేదని చెబుతున్నప్పుడు.. ఆయన అమెరికా కాన్సులేట్ సమావేశానికి ఎలా వెళ్లారని నిలదీశారు.
ఇదే సమయంలో తిరుపతిరెడ్డి అధికారిక సమావేశాలకు ఏ హోదాలో హాజరవుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాల్లో ఆయన ఏ అధికారిక హోదాతో పాల్గొంటున్నారని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విచారణ కోరుతామని వెల్లడించారు.
భూ కేటాయింపుల అంశంలో ఎలాంటి రాజీ ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు. సంబంధిత పత్రాలు, నిర్ణయాలు, అధికారిక హోదాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టెస్రాక్ట్ వ్యవహారంపై బీఆర్‌ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.
ఇక రాష్ట్ర ఓటర్ల జాబితాపైనా కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 74 లక్షల ఓట్లు తొలగించే అవకాశం ఉందన్న ప్రచారం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత పార్టీ నేతలు న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా బీఆర్‌ఎస్ తరఫున చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుందని తాము భావిస్తున్న కృష్ణా జలాల అంశాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. జీఆర్ఎంబీ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం హాజరవుతుందా లేదా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జలసౌధలో జరిగే జీఆర్ఎంబీ సమావేశం అజెండాను మార్చకపోతే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం చెబుతున్నప్పటికీ.. తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీ రాజకీయాలకు అతీతంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణ యాగాలు చేయడాన్ని తప్పుపట్టడం లేదని కేటీఆర్ అన్నారు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేయాల్సిన పనులను కూడా సమర్థంగా నిర్వహించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
