- 14న పూలే దంపతుల విగ్రహావిష్కరణ
- సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ
- బీసీ ప్రజాప్రతినిధులు ఏకం కావాలి
- కుల సంఘాల నాయకులు భాగస్వామ్యం కావాలి
- సభకు భారీగా తరలిరావాలి
- పూలే దంపతుల ఆశయాలే స్ఫూర్తి
- బీసీల హక్కుల కోసం పోరాటం
- సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబాటు
- బీసీ సభను విజయవంతం చేయాలని పిలుపు
హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 12:
ఈ నెల 14న హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం ఏర్పాట్లపై డీఎస్‌ఎస్ భవన్‌లో బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులతో సన్నద్ధత సమావేశం నిర్వహించారు. కార్యక్రమ ప్రాంగణ అలంకరణ, సభా మైదానంలో ఏర్పాట్లు, రవాణా, భద్రత, ఇతర అవసరాలకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వేదిక ఏర్పాట్లను ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా స్పష్టమైన ప్రణాళికతో రూపొందించాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల చైర్మన్లకు వారి హోదాలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన చోట ప్రత్యేక డయాస్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమం సందర్భంగా ఎలాంటి సమన్వయ లోపాలకు తావులేకుండా సంబంధిత శాఖలు, పరస్పర సమన్వయంతో పనిచేయాలని, పకడ్బందీ రూట్ మ్యాప్‌లను సిద్ధం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పూలే దంపతుల విగ్రహావిష్కరణ అనంతరం జరిగే సభకు బీసీ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సామాజిక సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే చేసిన కృషి చిరస్మరణీయమని మంత్రి పేర్కొన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో బీసీ వర్గాలన్నీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, ఈర్లపల్లి శంకరయ్య, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమయాదేవి, వివిధ కుల సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
