క్యూర్ పరిధిలో రేపే ఇందిరమ్మ టవర్స్‌కు శ్రీకారం

  • కూకట్‌పల్లిలో శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
  • ఏడాదిలో గృహప్రవేశాలు జరిగేలా ప్రణాళిక
  • క్యూర్ పరిధిలో ఏడాది లో లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం
  • తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 8 వేల ఇళ్ల నిర్మాణం
  • అర్హులైన పేదలకు పారదర్శకంగా లక్కీడిప్ ద్వారా కేటాయింపు
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్ వెలుతురు ఆగస్టు 12:

హైదరాబాద్ మహానగరంలో ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల కలను సాకారం చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

క్యూర్‌ పరిధిలో చేపడుతున్న ప్రతిష్టాత్మక ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి గురువారం (13వ తేదీ) సాయంత్రం కూక‌ట్‌ప‌ల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంపై బుధ‌వారం అధికారుల‌తో మంత్రిగారు స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ కూక‌ట్‌ప‌ల్లిలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్ధాప‌న చేయ‌నున్న ఐదు ఎక‌రాల ప్రాంతంలో నాలుగు ట‌వ‌ర్స్ నిర్మిస్తామ‌ని ఒక్కో ట‌వ‌ర్‌లో 120 చొప్పున ఫ్లాట్స్ ఉంటాయ‌న్నారు. ఒక్కో ఫ్లోర్‌లో 12 ఫ్లాట్స్ ఉండేలా 480 ఫ్లాట్స్ నిర్మాణం జ‌రుగుతుంద‌ని దీనికోసం 43.20 కోట్ల రూపాయిలు ఖ‌ర్చ‌వుతుంద‌ని తెలిపారు. క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణానికి ఇంత‌వ‌ర‌కు సుమారు 90 ఎక‌రాల‌ను ఎంపిక చేశామ‌ని మంత్రి గారు తెలిపారు.

హైద‌రాబాద్ నగరం నడిబొడ్డున పేదవాడి ఇంటికి పునాది వేయడం అంటే కేవలం ఒక భవనం నిర్మించడం కాదు.. ఒక కుటుంబానికి భద్రత, ఒక తరానికి భరోసా, పేదవాడికి గౌరవంతో కూడిన జీవితం అందించడమే అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో నగరంలోనే సొంత ఇల్లు కావాలనే పేదల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఇందిరమ్మ టవర్స్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం హైదరాబాద్ గృహ నిర్మాణ రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదలు నగరానికి దూరంగా కాకుండా.. నగరంలోనే గౌరవంగా జీవించాలి అనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందించిందన్నారు.

నగరంలోని కీలక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను సద్వినియోగం చేసుకుని బహుళ అంతస్తుల టవర్లను నిర్మించడం ద్వారా వేలాది పేద కుటుంబాలకు సొంతింటిని అందించనున్నామని తెలిపారు. ఇది ఒకసారి చేపట్టి ముగించే పథకం కాదని, హైదరాబాద్‌లో పేదల గృహ అవసరాలను దశలవారీగా తీర్చే నిరంతర గృహ నిర్మాణ కార్యక్రమని స్పష్టం చేశారు.

క్యూర్ పరిధిలో ఈ ఏడాది లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 8,000 ఇళ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి సంబంధించి గత నెల 20వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామని, ఇప్పటివరకు సుమారు 50 వేల దరఖాస్తులు అందాయని మంత్రి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు.

ఇందిరమ్మ టవర్స్‌లో లబ్ధిదారులకు అందించే ఇళ్లు సౌకర్యవంతంగా, ఆధునిక ప్రమాణాలతో నిర్మించనున్నామని తెలిపారు. ప్రతిపాదిత ఇంటిలో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్‌తో కలిపి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుందని చెప్పారు.

నగరంలోని అత్యంత కీలక ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి పది అంతస్తుల వరకు టవర్లను నిర్మించనున్నట్లు వివరించారు. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఈ ఇళ్లలో లబ్ధిదారుడి పేరుతో అన్‌డివైడెడ్ షేర్ కింద సుమారు 20 నుంచి 25 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో లబ్ధిదారుడికి లభించే భూమి వాటా విలువ సుమారు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందన్నారు. ఇలాంటి విలువైన ప్రాంతాల్లో పేదలకు సొంతింటి అవకాశం కల్పించడం దేశంలోని ఇతర మహానగరాలకు కూడా ఆదర్శంగా నిలిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

దరఖాస్తుల స్వీకరణ అనంతరం అర్హతలను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఎలాంటి రాజకీయ జోక్యం, సిఫార్సులు, అవకతవకలకు తావులేకుండా అర్హులైన పేదల నుంచి పారదర్శక పద్ధతిలో డ్రా/లక్కీడిప్ ద్వారా ఇళ్ల కేటాయింపు చేపడతామని తెలిపారు. ఇల్లు మంజూరు కాని దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు చెల్లించిన ఈఎండీ మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లిస్తామన్నారు.

ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా, వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది బోనాల పండుగ సమయానికి ఎంపికైన లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి దశను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, నిర్ణీత గడువులో నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

గత ప్రభుత్వాల హయాంలో పేదలకు ఇళ్ల విషయంలో హామీలు మాత్రమే మిగిలాయని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మాత్రం హామీలను కార్యరూపంలోకి తీసుకువచ్చి, పేదల ఇంటి తలుపు తట్టేలా గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోందని మంత్రి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.