హైడ్రా సేవలు రాష్ట్ర వ్యాప్తం కావాలి

  • హైడ్రా రాష్ట్రవ్యాప్తం కావాలి
  • వివిధ జిల్లాల ప్ర‌తినిధుల డిమాండ్‌
  • క‌మిష‌న‌ర్‌ను క‌లిసి హైడ్రాకు మ‌ద్ధ‌తు

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 12:

ప‌ట్ట‌ణీక‌ర‌ణ వేగంగా జ‌రుగుతున్న తెలంగాణ‌లో చెరువులు, కాలువ‌లు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు క‌బ్జాలు కాకుండా ఉండాలంటే హైడ్రాను రాష్ట్రవ్యాప్తం చేయాల‌ని ప‌లు జిల్లాల ప్రతినిధులు కోరారు. రెండు ద‌శాబ్దాల క్రితం హైడ్రా వ‌స్తే న‌గ‌రంలో గొలుసుక‌ట్టు చెరువుల‌న్నిటినీ కాపాడుకునేవాళ్ల‌మ‌ని అన్నారు. న‌గ‌రంలో మాదిరి చెరువులు మాయం కారాదంటే హైడ్రా సేవ‌లు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. హైడ్రాకు సంబంధించి ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏ.వీ. రంగనాథ్ను క‌లిసి సంపూర్ణ మ‌ద్ధ‌తు తెలిపారు.

ప్రభుత్వ, ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన భూములను కాపాడాలనే సదుద్దేశంతో హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. హైడ్రా అంటే భరోసా  అయితే కొందరు హైడ్రాను బూచిగా చూపిస్తున్నారని అది సరైంది కాదన్నారు.

నిజామాబాద్‌, కామారెడ్డి, సిద్ధిపేట‌, మెద‌క్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌కు చెందిన స్పీక్ (సొసైటీ ఫ‌ర్ పీపుల్స్ ఎంప‌వ‌ర్‌మెంట్ విత్ యాక్ష‌న‌బుల్ నాలెడ్జ్‌) ప్ర‌తినిదులు హైడ్రా క‌మిష‌న‌ర్‌ను కలిశారు. త‌ప్పుడు స‌మాచారంతో కోర్టుల‌ను, ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్న వారిప‌ట్ల అన్ని విభాగాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. తెలంగాణ‌లోని ప‌ట్ట‌ణాలు వ‌ర‌ద‌ల‌కు గురౌతున్నాయ‌ని, గ‌తేడాది వ‌రంగ‌ల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వ‌ర‌ద‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. చెరువులు, కుంట‌లు, వ‌ర‌ద కాలువ‌లు క‌బ్జా కాకుండా జాగ్ర‌త్త ప‌డితే వ‌ర‌ద‌లు త‌గ్గించ‌గ‌ల‌మ‌ని చెప్పారు.

ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌మైన తెలంగాణ హైడ్రాతోనే సాధ్య‌మ‌ని అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో హైడ్రా తరహా వ్యవస్థ అందుబాటులోకి వస్తే అక్రమ ఆక్రమణలకు అడ్డుకట్ట పడటంతో పాటు ప్రజా ఆస్తులను కబ్జా చేసే వారికి భయం ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, చెరువుల రక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణకు మరింత బలమైన చర్యలు చేపట్టాలని వారు కమిషనర్‌ రంగనాథ్ను కోరారు.

Leave A Reply

Your email address will not be published.