- ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ ప్రధకం ప్రారంభం
- 119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం
- ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
- 100 శాతం సబ్సిడీపై ఒక్కో కుట్టుమిషన్ విలువ రూ.12 వేలు
- బీసీ మహిళల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చి ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యం
హైదరాబాద్, వెలుతురు ఆగస్టు 13:
బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వంలో బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించి, వారిని కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
1.19 లక్షల మహిళలకు ప్రయోజనం
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12,000 కాగా, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 100 శాతం సబ్సిడీపై అందజేస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
పేద, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత
కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలకు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పించడమే ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, అలాగే కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల మేరకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కుట్టు మిషన్ల వినియోగంపై అవసరమైన శిక్షణను కూడా తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు.
మొదటి దశలో 1.19 లక్షల మందికి అవకాశం
కుట్టు మిషన్లు కోరుకునే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, మొదటి దశలో 1.19 లక్షల మంది అర్హులకు ప్రయోజనం కల్పిస్తామని మంత్రి చెప్పారు. భవిష్యత్‌లో పథకాన్ని మరింత విస్తరించి ఎక్కువ మంది బీసీ మహిళలకు ప్రయోజనం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
మహిళల ఉపాధికి ప్రభుత్వం అండ
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అదే విధంగా ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం ద్వారా బీసీ మహిళలకు ఇంటి నుంచే ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయిస్తూ, వాటి నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఇటీవల బలహీన వర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి బీసీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. కులగణన అనంతరం బీసీల అభివృద్ధికి సంబంధించిన తదుపరి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని మంత్రి పేర్కొన్నారు.
పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణకు భారీగా తరలిరావాలి
ఈనెల 14న సాయంత్రం 4 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ చాంపియన్‌గా నిలుస్తోందని, మహాత్మా జ్యోతిబాపూలేను స్మరించుకుంటూ ప్రగతి భవన్‌ను “మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్” గా, సచివాలయాన్ని “డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం’”గా పేరు మార్చినట్లు తెలిపారు.
అలాగే ఈనెల 18న బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు. ఈ రెండు కార్యక్రమాల్లో బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్, వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
