- పండుగ సాయన్న జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం జీఓ విడుదల
- ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం పండుగ సాయన్నకు తెలంగాణ ప్రభుత్వం ఘన గౌరవం
హైదరాబాద్, వెలుతురు, ఆగస్టు 20:
ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం, ప్రజా వీరుడు పండుగ సాయన్న జయంతి, వర్ధంతిని ప్రతి ఏటా అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గురువారం తెలంగాణ ప్రభుత్వం జీఓ ఆర్‌టీ నెం.1217ను విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల నిర్వహించిన పాపన్న గౌడ్ సభలో పండగ సాయన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఆదేశించారు.
జీఓ ప్రకారం ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని, డిసెంబర్ 10న పండుగ సాయన్న వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘రాష్ట్ర పండుగ’గా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు బీసీ సంక్షేమ శాఖను నోడల్ శాఖగా ప్రభుత్వం నియమించింది.
పండుగ సాయన్న చరిత్ర, పోరాట స్ఫూర్తి, ధైర్యసాహసాలను భావితరాలకు తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న నిర్ణయం పట్ల ముదిరాజ్ సమాజం చిరకాలంగా కోరుతున్న ఈ డిమాండ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల ముదిరాజ్ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం పండుగ సాయన్నకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గౌరవం కల్పించడం ముదిరాజ్ సమాజ ఆత్మగౌరవానికి దక్కిన గుర్తింపుగా హర్షం వ్యక్తం చేశారు.
