హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఉద్దేశపూర్వకంగా, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అసత్య ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రిని రాజకీయంగా ఎదుర్కోలేకనే కేటీఆర్, హరీష్ రావులు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు. నిన్న మొన్నటి దాకా ముఖ్యమంత్రి సోదరులైన కొండల్ రెడ్డి, తిరుపతిరెడ్డిలపై అక్కసు వెళ్లగక్కిన ఈ బావాబామ్మర్దులు, ఆ ఆరోపణలన్నీ అసత్యాలే అని తేలిపోవడంతో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారని ఎద్దేవా చేశారు.
ఆ ఆరోపణలన్నీ అబద్ధాలు అని ప్రజలకు స్పష్టంగా తెలియడంతో, ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి సతీమణి గీతమ్మ, ఆయన కూతురు, అల్లుడుపై దృష్టి సారించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని ఇందిరాశోభన్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పెయిడ్ సోషల్ మీడియా బ్యాచ్ ద్వారా పనిగట్టుకుని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కనీస సిగ్గు లేకుండా ఇష్టానుసారంగా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నారని ఇందిరాశోభన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు, కుటుంబానికి ముడిపెడుతూ ఈ తరహా ఆరోపణలు చేసే సోషల్ మీడియా బ్యాచ్‌పై చట్టపరమైన చర్యలు తప్పవని, వారు కఠినమైన శిక్షలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా, భువనగిరి పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చేలా ఆయన వీడియోను మార్ఫింగ్ చేసి, ఫేక్ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని ఇందిరాశోభన్ తీవ్రంగా పరిగణించారు.
ఇలాంటి ఫేక్ పోస్టులు పెట్టిన ఆయా అకౌంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారిపై కూడా చట్టపరమైన, కఠినమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ రావులే కాదు, ఇంకెవరు ఎన్ని కుట్రలు పన్నినా రేవంత్ రెడ్డి ఎలాంటి నిఖార్సైన, నిజాయితీ గల వ్యక్తో ఈ తెలంగాణ సమాజానికి తెలుసునని ఇందిరాశోభన్ స్పష్టం చేశారు. ఆయనపై బురద చల్లడానికి ప్రయత్నించడం అంటే ఆకాశంపై ఉమ్మివేయడమేనని, అది తిరిగి వారి ముఖం మీదే పడుతుందని హితవు పలికారు. కల్వకుంట్ల కుటుంబం గత పదేళ్లలో చేసిన పచ్చి భూదోపిడీని, అవినీతిని రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం ముందు సాక్ష్యాధారాలతో సహా పెట్టారనే అక్కసుతోనే బీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దిక్కు తోచని స్థితిలో ఉండి, ఏం చేయాలో తెలియక రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఇలాంటి నిరాధారమైన, వ్యక్తిగత ఆరోపణలు చేయడం నిజంగా సిగ్గుచేటని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావులు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని ఇందిరాశోభన్ సూచించారు. రాజకీయాల్లో హుందాతనం పాటించాలని, కుటుంబ సభ్యులను లాగడం మానుకోవాలని స్పష్టం చేశారు. ఇలాగే కేటీఆర్ దిగజారుడు రాజకీయాలు కొనసాగిస్తే, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని గుర్తుంచుకోవాలని ఇందిరాశోభన్ హెచ్చరించారు.
