పులిచింతల : రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గినప్పటికీ ప్రజలకు ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర విద్యుత్ పీక్ డిమాండ్ 15 వేల మెగావాట్లు ఉండగా.. ప్రస్తుతం దాదాపు 20 వేల మెగావాట్లకు చేరిందన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి సుమారు 4 వేల మెగావాట్లు తగ్గిందని చెప్పారు. దీంతో మొత్తంగా 8 వేల మెగావాట్ల అదనపు భారం ఏర్పడినప్పటికీ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు సమర్థంగా పనిచేస్తూ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాయని వెల్లడించారు. పులిచింతల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ఇప్పటివరకు జరిగిన ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూనిట్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు.
