ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ : రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉన్న టీజీఎస్ ఆర్టీసీ సిబ్బందిపై అకారణంగా దాడులకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి హెచ్చరించారు. టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని గెలాక్సీ బస్ స్టాప్ వద్ద బర్కత్‌పురా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TG 08 Z 0135) డ్రైవర్ ఎండీ. ఆజమ్ మరియు కండక్టర్ పి. లక్ష్మయ్యలపై జీషాన్ అనే వ్యక్తి అకారణంగా దాడికి పాల్పడ్డాడు. నిందితుడు తన మారుతీ XL6 కారుతో (TS 13 ES 0747) అడ్డుగా వచ్చి డ్రైవర్, కండక్టర్లపై బూతులు తిడుతూ భౌతిక దాడికి దిగాడు. ఈ క్రమంలో డ్రైవర్‌కు తల భాగంలో తీవ్ర గాయమయ్యింది. అంతేకాకుండా టికెట్ జారీ చేసే యంత్రాన్ని (TIM) ధ్వంసం చేసి బస్సులోని మహిళా ప్రయాణికులతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు.

కేసు నమోదు – రిమాండ్ కు తరలింపు :

డ్రైవర్ ఎండీ. ఆజమ్ ఇచ్చిన ఫిర్యాదుతో టోలిచౌకి పోలీసులు నిందితుడు జీషాన్ పై BNS చట్టంలోని 121(2), 126(2), 352, 351(2), 324(4), 79 సెక్షన్లతో పాటు ప్రజా ఆస్తుల ధ్వంసం నిరోధక చట్టం (PDPP Act) సెక్షన్ 3 కింద కేసు (Cr.No. 465/2026) నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజలకు నిరంతరం సేవలందించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడటం తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే వారిని, సంస్థ ఆస్తులకు నష్టం కలిగించే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.