నిజాంలు నీళ్లు తాగిన బావి పున‌రుద్ధ‌ర‌ణకు శ్రీ‌కారం

హైదరాబాద్‌, అక్టోబరు 01 : చ‌రిత్ర‌, సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌న‌మైన హైద‌రాబాద్‌లో ఏ ప్రాంతానికి వెళ్లినా చారిత్ర‌క నేప‌థ్యం ఉంటుంది. ఇక పాత బ‌స్తీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా.. అడుగ‌డుగునా చారిత్ర‌క సాక్ష్యాలు ఎన్నో.. అదే కోవ‌కు వ‌స్తుంది శివ‌రాంప‌ల్లిలోని బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు. ఈ చెరువుకు 356 ఏల్ల చ‌రిత్ర ఉంటే.. ఆ చెరువు కింది భాగంలో 1.50 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ఊట బావికి కూడా అంతే ప్ర‌త్యేక‌మైన చారిత్ర‌క నేపథ్యం ఉంది. ఇప్ప‌టికే చెరువును పున‌రుద్ధ‌రించి పాత‌బ‌స్తీకి మ‌ణిహారంగా అందించిన హైడ్రా ఇప్పుడు ఆ చెరువు కింద ఉన్న ఊట బావికి కూడా జీవం పోయాల‌ని నిర్ణ‌యించింది. 1.50 ఎకరాల విస్తీర్ణంలోని ఈ చారిత్రక బౌలి పునరుద్ధరణను వారసత్వ పరిరక్షణ, పర్యావరణ అభివృద్ధి, ప్రజా ప్రయోజనం అనే మూడు అంశాలను సమన్వయం చేసే కార్యక్రమంగా హైడ్రా భావించింది. నిర్లక్ష్యానికి గురైన చారిత్రక ఆస్తిని తిరిగి ప్రజలకు అందివ్వ‌డం.. పర్యావరణానికి ఉపయోగపడేలా చూడ‌డ‌మే ఈ బావి పునరుద్ధర‌ణ ముఖ్య ఉద్దేశం. నగర చారిత్రక జల నిర్వహణ పద్ధతులను పౌరులు, విద్యార్థులు, భవిష్యత్ తరాలు తెలుసుకుని, అర్థం చేసుకునే అవ‌కాశాన్ని హైడ్రా క‌ల్పిస్తోంది. ఇటీవ‌లే ప‌నులు మొద‌ల‌య్యాయి. రెండు మూడు నెల‌ల్లో ఈ ప‌నులు పూర్త‌యి.. ఊట‌బావిలోకి పుష్క‌లంగా నీరు రానుంది.

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేర‌కు..

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును మార్చి నెల 8వ తేదీన ప్రారంభించి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చారు. అప్పుడే ఈ చెరువుకు ఆనుకుని ఉన్న చారిత్రక బావి విష‌యాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెనువెంట‌నే అభివృద్ధికి అడుగులు ప‌డ్డాయి. చెరువు అభివృద్ధి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన విమోస్ టెక్నోక్రాట్స్ సంస్థనే ఇప్పుడు చెరువు కింద ఉన్న చారిత్ర‌క బావి పున‌ర్నిర్మాణాన్ని కూడా చేప‌ట్టింది. నిజాంల కాలంలో పాల‌కుల‌కు ఔష‌ధ గుణాలున్న తాగునీరందించిన చెరువుతో పాటు కింద‌న ఉన్న ఊట బావి కాల‌గ‌ర్భంలో క‌లిసిపోతున్న త‌రుణంలో హైడ్రా చ‌రిత్ర‌ను త‌వ్వితీసిన విష‌యం అంద‌రికీ విధిత‌మే. 100 ఎక‌రాల మేర విస్త‌రించి ఉన్న ఈ చెరువు క‌బ్జాల‌కు గురైంది. చివ‌ర‌కు 4 ఎక‌రాల‌కు ప‌రిమిత‌మైంది. హెచ్ ఎం డీ ఏ లెక్క‌ల ప్ర‌కారం 17 ఎక‌రాలు క‌గా ఆ మేర‌కు ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి చెరువుకు హైడ్రా జీవం పోసింది. మ‌ట్టితో నింపేసి లే ఔట్‌గా మార్చిన త‌రుణంలో.. క‌బ్జాల‌ను తొల‌గించి చెరువును త‌వ్వి తీసింది. స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు ఊట బావిని కూడా పున‌రుద్ద‌రిస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త, మట్టి, ఒండ్రుమట్టి (స్లష్), దట్టమైన పిచ్చి మొక్కలతో నీటిని నిల్వ చేసే సామర్థ్యం కోల్పోయిన ఊట బావిని త‌వ్వి చ‌రిత్ర‌కు జీవం పోస్తోంది హైడ్రా.

చ‌రిత్రం ఎంతో ఘ‌నం.. హైడ్రాతో భావి త‌రాల‌కది స‌జీవం

చారిత్ర‌క న‌గ‌రంలో ఎన్నో పురాత‌న బావిలున్నాయి. ఒక్కో బావిది ఒక్కో చ‌రిత్ర అయితే బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు కింద ఉన్న బావికి కూడా చాలా పేరుంది. ఈ ఊట బావిలో నీరు ఔష‌ధ గుణాలుండేవ‌ని.. నిజాం పాల‌కులు ఆ నీటినే తాగేవార‌ని చెబుతుంటారు. బుమ్-రుక్న్-ఉద్-దౌలా సరస్సు కేవలం ఒక జలవనరు మాత్రమే కాదు.. న‌గ‌ర ప్ర‌జ‌ల వారసత్వ సంపద. మూడవ నిజాం సికందర్ జా పాల‌నా కాలంలో.. సుమారు 1770 ప్రాంతంలో ఈ సరస్సును నిర్మించినట్లు చ‌రిత్ర చెబుతోంది. ఆ కాలంలో ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్-ఉద్-దౌలా పేరుమీదుగా ఈ సరస్సుకు పేరు వచ్చినట్లు చారిత్రక సమాచారం. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు కట్ట, పరిసరాల్లోని ఔషధ మొక్కల ద్వారా నీరు సహజంగా వడపోతకు గురై బౌలిలోకి చేరేదని, అక్కడి నీరు స్వచ్ఛతతో పాటు ఔషధ గుణాలకు కూడా విలువైనదిగా భావించేవారని చెబుతారు. ఔష‌ధ గుణాలున్న ఈ నీటిని ఎడ్ల బండ్ల ద్వారా సుదూర ప్రాంతాలకు తరలించేవారని, చివరకు లండన్ వరకు కూడా ఈ నీటికి సంబంధించిన ప్రయాణం జరిగినట్లు కథనాలు ఉన్నాయి. చెరువులో ఔష‌ధ గుణాలున్న చెట్ల కొమ్మ‌లు, బెర‌డ‌లు, పూలు వేసి.. ఉంచ‌డం. చెరువు కింద ఉన్న ఊట బావిలోకి వ‌చ్చిన ఆ నీటిలో ఔష‌ధ గుణాలుండేవ‌ని చ‌రిత్ర చెబుతోంది. బుమ్ – రుక్న్‌-ఉద్‌-దౌలా చెరువు, ఔషధ మొక్కలు, పురాతన బౌలి.. ఇవన్నీ కలిసి హైదరాబాద్‌లో నీటి సంరక్షణ, సహజ వడపోత, ప్రకృతి ఆధారిత వైద్య విధానాలపై ఉన్న సంప్రదాయ జ్ఞానానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తాయి. బుమ్-రుక్న్-ఉద్-దౌలా వారసత్వాన్ని పరిరక్షించడం అంటే కేవలం ఒక సరస్సును కాపాడట‌మే కాదు.. నీరు, ప్రకృతి, వైద్యం, నిజాం రాజవంశ చరిత్రతో ముడిపడిన శతాబ్దాల నాటి వారసత్వాన్ని పరిరక్షించడంగా హైడ్రా బావిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.