హైదరాబాద్, అక్టోబర్ 07: వర్షం పడితే నీట మునిగే పరిస్థితి ఫతేనగర్ – బాలానగర్ పారిశ్రామిక వాడది. ఇప్పుడా పరిస్థితులు మారనున్నాయి. ఫతేనగర్ ప్రాంతాల్లో నాలా పూడిక తీత పనులను హైడ్రా ప్రారంభించింది. కల్వర్టుల వద్ద పూడిక తీస్తే సరిపోదని హైడ్రా గ్రహించింది. నాలా పొడుగునా పూడికను తొలగిస్తే తప్ప వరద ముప్పు తప్పదని భావించింది. దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు హైడ్రా శ్రీకారం చుట్టింది. మాన్సూన్ ఎమర్జనీ టీమ్(మెట్), డిజాస్టర్ రెస్పాన్స్ (డీఆర్ ఎఫ్) బృందాలను రంగంలోకి దించింది. ఫతేనగర్ – బాలానగర్ పరిసరాల్లో పూడిక తీత పనులు ఎలా సాగుతున్నాయనేది హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు సంబంధిత శాఖల అధికారులతో కలిసి గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్యగారు కూడా కమిషనర్ వెంట ఉన్నారు. ల్యాంగ్ ఆర్మ్ హ్యాండ్ జేసీబీతో పూడికను తొలగించే పనులను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. నాలా పొడుగునా ఆక్రమణలుంటే గుర్తించి వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాలువ ఆరంభంలో 25 మీటర్లు.. ఫతేనగర్ ప్రాంతాల్లో 40 మీటర్ల వెడల్పు ఉండాల్సిన నాలా కబ్జాలకు గురై కుంచించుకుపోయిందని హైడ్రా కమిషనర్ దృష్టికి స్థానిక అధికారులు తీసుకువచ్చారు. త్వరలోనే అక్కడి పారిశ్రామిక యూనిట్ల వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వరద కాలువకు అడుగడుగునా ఆటంకాలు..
పరికి చెరువు, ఐడీఎల్ చెరువు నుంచి వచ్చే కూకట్‌పల్లి వరద కాలువకు గౌతంనగర్ పరిసరాల్లో ఫాక్స్ సాగర్ వరద కాలువ కలుస్తుంది. ఆరంభంలో 25 మీటర్లు, తర్వాత 40 మీటర్లకు పైగా ఉండాల్సిన వరద కాలువకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫతేనగర్, బాలానగర్ పరిసరాల్లో పారిశ్రామిక వాడ లే ఔట్ ప్రకారం వరద కాలువ విస్తీర్ణం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. ఎక్కడికక్కడ కబ్జాలకు గురై కుంచించుకుపోయింది. దీనికి తోడు పెద్దమొత్తంలో పూడిక పేరుకుపోవడంతో ఏమాత్రం వర్షం పడినా పరిసర ప్రాంతాలను ముంచెత్తడం సాధారణంగా మారింది. ఇదే వరద కాలువకు మురుగు నీటితో పాటు.. పారిశ్రామిక ప్రాంతాల నుంచి వ్యర్థ జలాలు కూడా తోడయ్యాయి. దీంతో ఆయా పరిసరాలు దుర్గంధభరితంగా మారాయి. భూగర్భ జలాలు కూడా కలుషితమై ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయమై బాలానగర్ పారిశ్రామిక వాడకు చెందిన వివిధ సంస్థల యజమానులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాలువ హద్దుల ప్రకారం నిర్మాణాలు చేపట్టినా.. కొంతమంది ఆక్రమణలకు పాల్పడగా.. వరద సాఫీగా వెళ్లని పరిస్థితి ఉందని వాపోయారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికతో పాటు.. ఆక్రమణలను తొలగిస్తే చాలావరకు ఉపశమనం ఉంటుందని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో కోరారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి పనులు వేగంగా జరగాలని ఆదేశించారు.
లారీల కొద్దీ పూడిక తొలగింపు..
పరికి చెరువు – ఐడీఎల్ చెరువు నుంచి వచ్చే వరద కాలువలు కూకట్‌పల్లి వద్ద కలిసి భరత్‌నగర్ వంతెన పక్కనుంచి దీన్‌దయాల్ కల్వర్టు, ఫతేనగర్, బాలానగర్ శోభ కాలనీ, గౌతంనగర్, ఐజీపురం, బేగంపేట, ప్రకాష్‌నగర్ మీదుగా హుస్సేన్‌సాగర్‌లో కలుస్తుంది. ఫాక్స్ సాగర్ నుంచి జీడిమెట్ల మీదుగా వచ్చే వరద కాలువ గౌతంనగర్ పరిసరాల్లో కూకట్‌పల్లి నాలాలో కలుస్తుంది. ఇలా సాగే ఈ కాలువలో దశాబ్దాలుగా చెత్త పేరుకుపోయింది. దీంతో 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షం పడినా పరిశ్రామిక ప్రాంతాలతో పాటు నివాసాలు కూడా నీట మునుగుతుంటాయి. ఈ నాలాలో ఆరేడు అడుగుల మేర పూడిక పేరుకుపోయింది. కల్వర్టుల వద్ద పూడిక తొలగిస్తే సరిపోదని హైడ్రా గ్రహించింది. దీన్‌దయాల్‌నగర్ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర నాలా పొడుగునా పూడిక తొలగిస్తే చాలావరకు వరద ముప్పు తప్పించవచ్చునని హైడ్రా భావించింది. ఈ మేరకు మంగళవారం నుంచి పూడిక తీత పనులను ప్రారంభించింది. కల్వర్టు వద్దే లారీల కొద్దీ పూడిక బయట పడుతోంది. ఇలా మొత్తం తీస్తే చాలా పెద్దమొత్తంలో పూడిక బయట పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైడ్రా రంగంలోకి దిగడంతో ఫతేనగర్, బాలానగర్ పరిసర ప్రాంత పారిశ్రామిక వాడతో పాటు.. నివాస ప్రాంతాల వారు ఊరట చెందారు. పూడిక తీత పనులు పూర్తి స్థాయిలో జరుగుతాయని భావిస్తున్నారు. ఆక్రమణలు తొలగించడంలో తాము కూడా సహకరిస్తామని అక్కడి పారిశ్రామిక వాడలోని పలు యూనిట్ల యజమానులు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారికి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
