హైదరాబాద్ వెలుతురు : జూరాల నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ఆందోళన చేపట్టిన రైతులపై కేసులు నమోదు చేయడం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ హయాంలో రైతుల చేతులకు బేడీలు వేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందని ఆయన ఆరోపించారు. ఇంజనీర్లతో రైతులపై కేసులు పెట్టించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ చేతగానితనం కారణంగానే పంటలకు నీరు అందక ఎండిపోతున్న దుస్థితి నెలకొందని అన్నారు. కడుపుమండిన రైతులు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా? పోలీసులను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేస్తారా? ఇదెక్కడి దుర్మార్గం, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు ఉన్న సమయంలో నీటిని లిఫ్ట్ చేయకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. నీటిని ఒడిసిపట్టకుండా వదిలేసి తెలంగాణకు జల ద్రోహం చేశారని విమర్శించారు. తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే శిక్షలను రైతులు అనుభవించాలా అని ప్రశ్నించారు. సాగునీరు, విద్యుత్ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని, సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని హరీశ్ రావు అన్నారు. ఇది ప్రజా పాలనా? లేక ప్రజా పీడనా? అని ప్రశ్నించారు. రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రైతు వ్యతిరేక చర్యలు కొనసాగితే పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హరీశ్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
