సూర్యాపేటలో కదంతొక్కిన బీఆర్‌ఎస్ శ్రేణులు
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సద్దల చెరువు నుంచి కొత్త బస్టాండ్ వరకు 2కే రన్, ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు డా. గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ లింగయ్యయాదవ్, మాజీ జెడ్పీ చైర్మన్ దీపిక యుగేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఏర్పాటుతో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, ట్యాంక్‌బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తదితర అభివృద్ధి పనులు జరిగాయని గాదరి కిశోర్‌కుమార్ పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఏర్పాటు చేసిన నూతన జిల్లాలతో పాలన ప్రజలకు చేరువైందని, అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాయని ఆయన అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు తెలంగాణలో అభివృద్ధికి నాంది పలికిందని పేర్కొన్నారు.
