భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి
పాల్ఘర్, వెలుతురు : మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబై సమీపంలోని నలసోపార-వసాయ్ లింక్ రోడ్డులో ఉన్న ‘ఇంపీరియల్ హైట్స్’ భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. మంటలతో కమ్ముకున్న పొగ కారణంగా ఊపిరి ఆడక ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలసోపార-వసాయ్ లింక్ రోడ్డులోని ఇంపీరియల్ హైట్స్ భవనంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో తీవ్ర భయాందోళనలతో నివాసితులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వసాయ్-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. భవనంలోని 14వ అంతస్తులో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను క్రేన్ సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన ఇద్దరు మహిళలను ఫల్గుని షా, అశ్విని పార్కర్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
