రేపు భారత్ లో పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి
వాషింగ్టన్, వెలుతురు, అక్టోబర్ 19 : భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని, తుది దశకు చేరుకున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. మంగళవారం భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తుతం ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని, దీనికి చాలా దగ్గరగా ఉన్నామని రూబియో సోమవారం చెప్పారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆంక్షల విషయంలోనూ ప్రపంచ ఇంధన సరఫరా, ధరలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా, ధరలపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఆంక్షల నుంచి మినహాయింపులు ఇవ్వాల్సి వచ్చిందని రూబియో పేర్కొన్నారు. ఇంధనం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం కొన్ని దేశాలకు భౌగోళిక పరిస్థితుల కారణంగా కష్టమని చెప్పారు. విదేశాంగ విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ అంశాలన్నింటినీ సమతుల్యం చేయాల్సి ఉంటుందని వివరించారు. వాణిజ్య ఒప్పందం కూడా అమెరికా అధ్యక్షుడి నిర్ణయాల్లో పరిగణనలోకి వచ్చే అంశాల్లో ఒకటని తెలిపారు.
