బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం సమీక్ష

బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం సమీక్ష

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 27 : సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాలు, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆత్మగౌరవ భవనాలు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ, బీసీ వర్గాలకు స్వయం ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యా నిధి పథకం అమలుపై మంత్రి సమీక్షించారు. ఈ పథకం ద్వారా అర్హులైన మెరిట్ విద్యార్థులకు పూర్తి పారదర్శకతతో పెండింగ్ లేకుండా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు 38 ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన జీవోల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

 

బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటింటా కుట్టు మిషన్ల పథకం అమలుపై మంత్రి సమీక్షించారు. ఈ పథకానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిందని, సుమారు 4.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున మొత్తం 1.90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 9న లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అందించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, టెండర్ ప్రక్రియతో పాటు ఇతర అవసరమైన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చిన దరఖాస్తుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించే అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు.

 

రాష్ట్రంలోని 327 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల్లో ఆర్సీవోలు పర్యటించి మౌలిక సదుపాయాలు, సిబ్బంది, విద్యార్థుల సంఖ్య, ఖాళీలు, సొంత భవనాల స్థితిగతులు తదితర అంశాలపై నివేదికలు అందించినట్లు మంత్రి తెలిపారు. ఈ నివేదికల ఆధారంగా పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

రాష్ట్రంలోని 327 గురుకుల పాఠశాలల్లో కేవలం 26 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉండగా, మిగిలిన 301 పాఠశాలలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 37 గురుకులాలకు సొంత స్థలాలు ఉన్నందున వాటిలో భవనాల నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేసే అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. గురుకులాలకు కూడా సొంత భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అధికారులు గురుకుల పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శించాలని, జిల్లా కలెక్టర్లు నెలకు ఒక గురుకుల పాఠశాలను సందర్శించి నివేదిక అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురుకులాలకు అవసరమైన స్థలాల సేకరణను త్వరగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు.

 

నవంబర్ మొదటి వారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, జిల్లా కలెక్టర్లు, ఆర్సీవోలు, ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గురుకులాల సమస్యల పరిష్కారంపై సమీక్షించనున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్లకు లేఖలు రాసి విద్యార్థులకు ఎల్ నినో ప్రభావం, నీటి పొదుపు, విద్యుత్ వినియోగంలో మితవ్యయం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా వారు తమ తల్లిదండ్రులకు కూడా ఈ అంశాలను వివరించే అవకాశం ఉంటుందని తెలిపారు.

 

బీసీ స్టడీ సర్కిళ్లలో సంస్కరణలు చేపట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యంగా నాణ్యమైన శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ అంశంపై ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సమర్థవంతమైన డైరెక్టర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. డైరెక్టర్ల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, యూపీఎస్సీ, గ్రూప్-1 వంటి పోటీ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి అవకాశాలు కల్పించేలా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని తెలిపారు.

 

బీసీ కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. మధిర వంటి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా పశువుల పంపిణీ తరహా ఉపాధి పథకాన్ని ప్రారంభించి, లబ్ధిదారుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ పథకం కింద చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు వివిధ కుల సంఘాలకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధి పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

బీసీ వితంతువులు, ఒంటరి మహిళలకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రజకుల కోసం ఆధునిక ధోబీఘాట్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై బలహీనవర్గాల ఐకాన్‌లుగా నిలిచిన ప్రముఖుల విగ్రహాలకు పేర్లు రాయించే పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాటమయ్య రక్షణ కవచాల పంపిణీపై సమీక్షిస్తూ, శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీరా కేఫ్, నందనవనాల నిర్వహణ, అభివృద్ధి అంశాలపై మంత్రి చర్చించారు. వాటిని అధికారులు స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు.

 

బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా, స్వయం ఉపాధి అవకాశాలు పెరిగేలా, గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి, మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాల కార్యదర్శి సైదులు, అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్, పద్మ, మామిడి హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.