వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండాలని వీహెచ్ ప్రత్యేక ప్రార్థనలు
అంబర్పేట్, వెలుతురు, అక్టోబర్ 27 : హైదరాబాద్ అంబర్పేట్ శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు ఆధ్వర్యంలో అమ్మవారి ఆశీస్సులతో మూడు రోజుల పాటు నిర్వహించే శ్రీ వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం రెండవ రోజు వైభవంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు నిండి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలనే సంకల్పంతో ఈ యాగాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా వి. హనుమంతరావు మాట్లాడుతూ, వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, నీటి కొరత తీరాలని, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని వరుణ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండి రైతన్నలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో వరుణ యాగం చేపట్టినట్లు పేర్కొన్నారు.
అమ్మవారి కృపతో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న యాగాలు విజయవంతమై, రాష్ట్రం సుభిక్షంగా మారాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు.
వచ్చేనెల నవంబర్ 1వ తేదీన రామ్ లీలా మైదానంలో ఓటు చోరీపై జరిగే భారీ ఎత్తున ప్రదర్శనకు ప్రతి ఒక్కరు తరలిరావాలని హనుమంతరావు కోరారు.
