ఇంటర్ బోర్డు ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా

ఇంటర్ బోర్డు ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 27 :  భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేసిన ప్రక్రియలో సమర్పించిన సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరిపి, వెరిఫికేషన్‌ను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డు అధికారులకు వినతిపత్రం అందజేయడం జరిగింది..

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజినీకాంత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 2023లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 3,800 మంది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేశారని అన్నారు. వీరిలో ఇప్పటికే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు గుర్తించిన 35 మందిని తొలగించినట్లు పేర్కొన్నారు.

మరో 700 నుంచి 800 మంది వరకు పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పీజీ చదివినట్లు సర్టిఫికెట్లు సమర్పించి రెగ్యులరైజ్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించిన అధికారులు ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సుమారు 400 సర్టిఫికెట్లను బోర్డుకు సమర్పించగా, వాటిలో కొన్ని చదివినట్లు ధ్రువీకరించే లేఖలు కూడా నకిలీవని వార్తలు వస్తున్నాయని అన్నారు.

ఈ నేపథ్యంలో సమర్పించిన అన్ని సర్టిఫికెట్లను సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించాలని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రెగ్యులరైజ్ అయినట్లు విచారణలో తేలిన లెక్చరర్లపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది.

అదేవిధంగా, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఇప్పటివరకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇవ్వలేదని బోర్డు ప్రకటించినప్పటికీ, కొన్ని కళాశాలలు అనుమతులు ఉన్నట్లు ప్రచారం చేసుకుంటూ విద్యార్థులను చేర్పించుకుంటున్నాయి. విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ, సరైన వసతులు లేకుండా ఇరుకైన గదుల్లో తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలను గుర్తించి, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అఫిలియేషన్ లేకుండా విద్యార్థులను చేర్పించుకునే కళాశాలలపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. కిరణ్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మమత, కార్యదర్శివర్గ సభ్యులు జి. కార్తీక్, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, రమేష్, నాయకులు నాగేందర్, భగత్, అర్జున్, వర్ధన్, నీరజ్, శ్యామ్, అజయ్, కౌశిక్, భారత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.