తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీయే!

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీయే!

హైదరాబాద్‌, వెలుతురు అక్టోబర్‌ 27:

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, 100 అసెంబ్లీ సీట్లు సాధించడమే తమ లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు భ్రమల్లో ఉన్నారని, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన పలు రాజకీయ అంశాలపై మాట్లాడారు. నవంబర్‌ నెలలో రాష్ట్రంలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన మహేశ్‌ కుమార్‌ గౌడ్‌.. నవంబర్‌ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సమన్వయం దేశంలో మరే పార్టీలోనూ లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నారని, ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా తాను చూశానని చెప్పారు.

కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో బలం

ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ పార్టీ శాశ్వతమని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీనే తమకు ప్రధాన బలమని, క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ పథకం, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందినవారు, 90 వేల ఉద్యోగాలు పొందినవారు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మేధావిగా భావిస్తామని, అయితే సరైన ఆలోచన లేకుండా అప్పులు చేశారని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. ఎల్‌నినో అంశంపై హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలు సరికావని అన్నారు. దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉందని పేర్కొన్నారు.

బీజేపీకి భవిష్యత్తు లేదని వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ ఇప్పట్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్న ఎనిమిది ఎంపీ స్థానాల్లో రెండు స్థానాలు గెలుచుకున్నా ఎక్కువేనని వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా మళ్లీ గెలవరని జోస్యం చెప్పారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ప్రాంతాల్లో 40 శాతం సీట్లు కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేస్తూ ప్రజలకు చేరువ కావాలని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.