మంత్రి సీతక్కను కలిసిన వైఎస్ షర్మిల దంపతులు
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 28 : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన భర్తతో కలిసి బుధవారం ప్రజా భవన్లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను మంత్రి సీతక్కకు అందజేసి ఆహ్వానించారు. తన నివాసానికి విచ్చేసిన వైఎస్ షర్మిల దంపతులను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నివసించిన భవనం కావడంతో ప్రజా భవన్లోని పలు ప్రాంతాలను కలియతిరుగుతూ షర్మిల తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని, గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని చూసి షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను మంత్రి సీతక్క ఆప్యాయంగా ఓదార్చారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి షర్మిల ఉన్న చిత్రపటాన్ని మంత్రి సీతక్క ఆమెకు జ్ఞాపికగా బహూకరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క తనయుడు సూర్య, ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
