కీమోథెరపీ కేంద్రాల పనితీరుపై మంత్రి రాజనర్సింహ ఆరా
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 3 : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేన్సర్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఎంఎన్‌జే, నిమ్స్ ఆస్పత్రుల్లో కేన్సర్ బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్సా విధానాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన కీమోథెరపీ కేంద్రాల పనితీరు, అక్కడ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.
ఇటీవల కేన్సర్‌ను నోటిఫయబుల్ వ్యాధిగా ప్రకటించడంతో పాటు, కేన్సర్ రిజిస్ట్రీ, ప్రత్యేక పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు కోసం చేపట్టాల్సిన చర్యలు, స్క్రీనింగ్ కార్యక్రమాల విస్తరణ, బాధితులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, కేన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
