ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్‌పై ఏసీబీ దాడులు
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 03 : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ నల్లబోతు యాదగిరిరావుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దృష్టి సారించారు. మంగళవారం ఆయనకు సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు సూర్యాపేటలోని ఆయన నివాసంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. యాదగిరిరావు బంధువులకు సంబంధించిన ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఆయనపై నమోదైన కేసు నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భాగంగా స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు, భూములు, ఇళ్ల కొనుగోళ్ల వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఆయన పేరు మీద ఉన్న ఆస్తులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లపై ఏమైనా ఆస్తులు ఉన్నాయా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో వచ్చిన ఆదాయం, గుర్తించిన ఆస్తుల విలువ మధ్య వ్యత్యాసాన్ని అధికారులు లెక్కించనున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత లభించిన పత్రాలు, ఇతర ఆధారాల ఆధారంగా ఆస్తుల విలువపై ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాల్లో ఎలాంటి ఆస్తులు, పత్రాలు గుర్తించారనే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
