ప్రతి ఏటా సదర్ ఉత్సవాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం ‎

‎ప్రతి ఏటా సదర్ ఉత్సవాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం

‎

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 04 :  ‎సదర్ ఉత్సవాలు ఏటా మరింత వైభవంగా, దినదినాభివృద్ధి చెందాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఈ ఉత్సవాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని స్పష్టం చేశారు. సదర్ సమ్మేళనాన్ని ఇంత భారీ స్థాయిలో నిర్వహించిన అంజన్ కుమార్ యాదవ్‌తోపాటు సదర్ ఉత్సవ కమిటీ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద బుధవారం నిర్వహించిన సదర్ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‎వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పశుసంపద కీలకమని, పశుసంపదను గౌరవించి, అభివృద్ధి చేసుకున్నప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని  అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సదర్ ఉత్సవాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నవంబర్ 1 నుంచి సదర్ ఉత్సవాలను అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని వివరించారు.

‎

‎అంజన్ కుమార్ యాదవ్ ప్రజా జీవితాన్ని ప్రస్తావిస్తూ.. యువజన కాంగ్రెస్ నాయకుడిగా, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవలందించారని  కొనియాడారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించి ప్రజలతో మమేకమై పనిచేశారని ప్రశంసించారు. సదర్ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతోపాటు పశుసంపద అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

‎

‎రాష్ట్రంలో పశుసంపదను పెంపొందించేందుకు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. సదర్ ఉత్సవాల్లో పాల్గొంటున్న కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ఈ కార్యక్రమాలు దోహదపడాలని ఆకాంక్షించారు.

‎

‎భారతీయ చరిత్రలోనూ పశుసంపదకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెబుతూ మహాభారతంలోని గోగ్రహణ ఘట్టాన్ని  ప్రస్తావించారు. పశుసంపద ఒక రాజ్యానికి, దేశానికి ఎంత ముఖ్యమో ఆ ఘట్టం తెలియజేస్తుందని అన్నారు. వ్యవసాయమే మన ఆర్థిక వ్యవస్థకు మూలమని, వ్యవసాయాన్ని బలోపేతం చేసే పశుసంపదను పరిరక్షించి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ‎సదర్ ఉత్సవాలు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని, వాటి ప్రాధాన్యతను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఉత్సవాలు భవిష్యత్తులో మరింత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని పునరుద్ఘాటించారు.

Leave A Reply

Your email address will not be published.