అమిత్ షాకు జగ్గారెడ్డి కౌంటర్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 04 : రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనుకుంటే 2004లోనే అయ్యేవారని, ప్రధాని పదవి ఆయన కుటుంబానికి కొత్త కాదని అన్నారు. దేశ ప్రజలు ఎవరిని ప్రధానిగా ఎన్నుకోవాలో నిర్ణయించే హక్కు అమిత్ షాకు లేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు గాను 14 స్థానాలు గెలిచి తీరుతామని, రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేస్తుందని ప్రకటించారు. శ్రీరాముడి పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఆయన అడుగుజాడల్లో పాలన సాగించడం లేదని జగ్గారెడ్డి విమర్శించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలోనే మహాత్మా గాంధీ ‘రఘుపతి రాఘవ రాజారాం’ అంటూ భజన చేశారని, అప్పటికి బీజేపీ పార్టీనే లేదని వ్యాఖ్యానించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడని, నెహ్రూ కేబినెట్లో మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. చరిత్రను తమకు అనుకూలంగా చెప్పుకుంటూ కాంగ్రెస్ నేతల ఘనతను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జగ్గారెడ్డి విమర్శించారు.
