పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 8.1 శాతం.. రూ.3.04 లక్షల కోట్లకు జీఎస్‌వీఏ

పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 8.1 శాతం.. రూ.3.04 లక్షల కోట్లకు జీఎస్‌వీఏ

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 04 :  తెలంగాణను ప్రపంచ స్థాయి డీప్‌టెక్, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయబోయే ఏఐ, క్వాంటం టెక్నాలజీ, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. బుధవారం బేగంపేట్ లోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) వందేళ్ల వేడుకలు, ‘తెలంగాణ డీప్ – టెక్ లీడర్ షిప్ సమ్మిట్’లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ఫిక్కీ వందేళ్ల ప్రస్థానం భారత పారిశ్రామిక రంగ పరిణామానికి అద్దం పడుతోందన్నారు. 2025–26లో రాష్ట్ర జీఎస్‌వీఏలో పారిశ్రామిక రంగం వాటా 8.1 శాతం వృద్ధి రేటుతో రూ.3.04 లక్షల కోట్లకు చేరిందన్నారు. స్టేట్ మర్చండైజ్ ఎక్స్ పోర్ట్స్ 39.3 శాతం పెరిగాయన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశ్రమలు, తయారీ రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సంస్థల సమష్ఠి భాగస్వామ్యంతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు, ఆవిష్కర్తలను ఆయన ఆహ్వానించారు. కార్యక్రమంలో ఫిక్కీ తెలంగాణ ఛాప్టర్ ఛైర్మన్ వి.వి. రామరాజు, కో – ఛైర్మన్ జయదేవ్ మీలా, ఎఫ్ టీసీసీఐ ప్రెసిడెంట్ కె.కె.మహేశ్వరి, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ ప్రైజెస్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.