పశువుల కొట్టం కంటే అధ్వానంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ : హరీశ్ రావు

పశువుల కొట్టం కంటే అధ్వానంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ : హరీశ్ రావు

 

ఇబ్రహీంపట్నం, వెలుతురు, నవంబర్ 04 :  మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళ్‌పల్లి వద్ద గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మద్దతు తెలిపారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులతో కలిసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, డీఎంఈతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

 

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, కాలేజీలో తాగునీరు, విద్యుత్, వాష్‌రూమ్‌లు, ల్యాబ్స్, లైబ్రరీ, హాస్టల్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని విమర్శించారు. 26 నెలలుగా భవనం అద్దె, విద్యుత్, నీటి బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు. భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఫైర్ సేఫ్టీ అనుమతులు కూడా లేవని, కాలేజీ పరిసరాల్లో పాములు, పందులు, కుక్కలు సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాలేజీ నిర్మాణానికి 25 ఎకరాల స్థలం, రూ.182 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లుగా నిర్మాణ పనులు చేపట్టలేదని ఆరోపించారు.

 

కలెక్టర్, డీఎంఈ వెంటనే విద్యార్థుల వద్దకు వచ్చి రాతపూర్వక హామీ ఇవ్వాలని, రెండు నెలల్లోగా అన్ని వసతులున్న భవనానికి కాలేజీని మార్చాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు బస్సు సౌకర్యం, తాగునీరు, వాష్‌రూమ్‌లు కల్పించడంతో పాటు కాలేజీ వరకు బస్సులు, విద్యార్థుల సొంత వాహనాలను అనుమతించాలని కోరారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్ రావు భరోసా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.