యాదవుల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు సదర్ సమ్మేళనాలు దోహదం : మంత్రి వాకిటి
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 04 : హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ సోదరులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిరక్షిస్తూ భావితరాలకు వాటి గొప్పతనాన్ని తెలియజేయడంలో సదర్ సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడుకుంటూ, వాటిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
యాదవ సోదరులు ఐక్యతతో ముందుకు సాగుతూ విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. యువత ఉన్నత విద్యను అభ్యసించి, అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలంటే వారి జనాభా, సామాజిక స్థితిగతులకు అనుగుణంగా అవకాశాలు, ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా కులగణనకు ప్రాధాన్యతనిస్తూ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. కులగణన ద్వారా వివిధ సామాజిక వర్గాల వాస్తవ పరిస్థితులను గుర్తించి, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో న్యాయమైన భాగస్వామ్యాన్ని కల్పించేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.
సదర్ సమ్మేళనం వంటి కార్యక్రమాలు యాదవ సోదరుల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు, వారి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడతాయని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా యాదవ సోదరుల ఐక్యతను చాటుతూ “జై యాదవ్.. జైమాధవ్” అంటూ నినదించారు. తెలంగాణలోని యాదవ బంధుమిత్రులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.
