పోలీసు అభ్యర్థులకు శిక్షణా తరగతులు ప్రారంభం
ములుగు, వెలుతురు, నవంబర్ 04 : ములుగు జిల్లా కేంద్రంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతకు అందిస్తున్న శిక్షణా తరగతులను రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మంత్రి నేరుగా మాట్లాడి, వారి చదువు, శిక్షణా విధానం, వసతి సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శిక్షణార్థులతో కలిసి సాధారణంగా భోజన క్యూ లైన్‌లో నిలబడి భోజనం చేశారు. అభ్యర్థులతో కలిసిమెలిసి వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా వారికి భరోసా కల్పించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకొని కష్టపడి చదవాలని, ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించి పోలీస్ ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు.
గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అభ్యర్థుల విజయానికి అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ గారు, DCC అధ్యక్షులు పైడాకుల అశోక్, డీఎస్పీ రవీందర్, ఆర్.ఐ, సీఐ, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
