38 బీసీ కుల సంఘాల భవన నిర్మాణాలకు రూ.88.50 కోట్ల నిధులు మంజూరు

38 బీసీ కుల సంఘాల భవన నిర్మాణాలకు రూ.88.50 కోట్ల నిధులు మంజూరు

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 05 :  రాష్ట్రంలోని 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి గతంలో కేటాయించిన రూ.88.50 కోట్ల నిధులకు సంబంధించి ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. ఈ జీఓ ప్రతులను మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ కుల సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు భవన నిర్మాణాలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఎండీఏ సహకారంతో కేటాయించిన స్థలాలను నిర్మాణాలకు అనువుగా అభివృద్ధి చేశామని, కుల సంఘాలు వెంటనే పనులు ప్రారంభించి ఏడాది కాలంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నెలా నిర్మాణాల పురోగతిని సమీక్షిస్తామని, అనుమతులను సింగిల్ విండో విధానంలో మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

 

బీసీలకు కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందనే ప్రచారంలో వాస్తవం లేదని, ఆ భూములు బలహీన వర్గాల ఆస్తులని, వాటి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ భవనాలు పేద బీసీ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, వసతి సౌకర్యాలు, సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయ దేవి, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.