భూగర్భజలాల పరిరక్షణకు అవసరమైనన్ని నిధులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 05 : భూగర్భజలాల పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అవసరమైతే ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులకు మించి నిధులు సమకూరుస్తామని స్పష్టం చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కరువు ఉపశమన చర్యలు, భూగర్భజల సంరక్షణపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలవారీగా భూగర్భజలాల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి, సంరక్షణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అమలవుతున్న జల సంరక్షణ, భూగర్భజల పునరుద్ధరణ కార్యక్రమాలను అధ్యయనం చేసి, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో నీటిపారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
