పద్మశాలీలకు గుడ్ న్యూస్.. జీవో నంబర్ 24 జారీ

పద్మశాలీలకు గుడ్ న్యూస్.. జీవో నంబర్ 24 జారీ

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 05 : తెలంగాణ రాష్ట్రంలోని పద్మశాలి సామాజిక వర్గానికి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన శుభవార్త అందింది. పద్మశాలి సమాజం కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కోకాపేట గ్రామ పరిధిలో పద్మశాలి ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులను మంజూరు చేస్తూ జీవో నంబర్ 24, తేదీ 02-11-2026ను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ, సహకారం, ప్రభుత్వ సానుకూల నిర్ణయం ఫలితంగా ఈ కీలకమైన ఉత్తర్వులు వెలువడటం పట్ల తెలంగాణ పద్మశాలి కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 కోట్లతో పద్మశాలి ఆత్మగౌరవ భవనాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించనున్నారు. ఈ భవనంలో విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర అవసరమైన సౌకర్యాలను కల్పించి, పూర్తిస్థాయిలో వినియోగానికి సిద్ధంగా అందించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ భవనం పద్మశాలి సామాజిక వర్గానికి ఒక ఆత్మగౌరవ ప్రతీకగా నిలవడంతో పాటు, సమాజ అభివృద్ధి, విద్యార్థులు, యువత, మహిళలు, చేనేత కార్మికులు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు మరియు సామాజిక సంస్థల కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పద్మశాలి సమాజ అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైన ముందడుగు అని గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి, తెలంగాణ సీనియర్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు – బీసీ సంక్షేమం, అభివృద్ధి వి. హనుమంతరావుకి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఐఏఎస్ సంబంధిత అధికారులకు మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కుల బంధావులకు, నాయకులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పద్మశాలి సమాజ అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరంతరం కృషి చేస్తుందని చైర్మన్ గూడూరి శ్రీనివాస్ తెలిపారు.