విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్లు

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్లు

 

ములుగు,  వెలుతురు, నవంబర్ 05 :  గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.

 

గిరిజన విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు.

 

గురువారం ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల సంక్షేమం తదితర అంశాలపై ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి మంత్రి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించి ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

 

విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని, మౌలిక సదుపాయాల నిర్వహణపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో గుర్తించి పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

 

అనంతరం ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి విద్యార్థుల సమస్యలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్ల సేవలను మంత్రి ప్రారంభించి, ఆయా నంబర్లతో కూడిన పోస్టర్లను ఆవిష్కరించారు.

 

గురుకులాలు, గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను 1800-425-3369 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి లేదా +91 9493368361 వాట్సాప్ నంబర్‌కు సందేశం పంపి తెలియజేయవచ్చని మంత్రి తెలిపారు. సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునేందుకు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 

ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో మాట్లాడుతూ, మంత్రి సూచనలకు అనుగుణంగా విద్యాసంస్థల పనితీరు, విద్యార్థుల సంక్షేమం, ఉపాధ్యాయుల బాధ్యతలు, మౌలిక సదుపాయాల నిర్వహణపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగా కళ్యాణి, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారులు, డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారులు, సహాయ గిరిజన అభివృద్ధి అధికారులు, ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ సంక్షేమ అధికారులు, ఐటీడీఏ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.