ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి వేడుకలు

ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి వేడుకలు

 

సిద్దిపేట, వెలుతురు, నవంబర్ 08 :  హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు పుల్లూరి వీరమ్మ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ఆమె ఇంట్లో నిర్వహించిన ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

 

సుదీర్ఘ కాలం తర్వాత ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో సొంతింటి కల సాకారం కావడంతో పుల్లూరి వీరమ్మ కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య తమ కొత్త ఇంట్లో తొలి దీపావళి పండుగను జరుపుకున్నారు.

 

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన లోకిణి స్వప్న దంపతులకు మంత్రి నూతన వస్త్రాలు అందజేసి, స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

 

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

 

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలన్నది ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం. సుదీర్ఘ కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదల కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాకారం చేస్తున్నాం.

 

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. సొంతింటి కల నెరవేరి కొత్త ఇంట్లో తొలి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న కుటుంబాల ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. సొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబానికి జీవితకాల స్వప్నం. ఆ కల నెరవేరినప్పుడు కలిగే ఆనందం ఇల్లు నిర్మించుకున్న వారికే తెలుస్తుంది.

 

గత పదేళ్లుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు లేకపోవడంతో రాష్ట్రంలో ఇళ్ల కోసం దరఖాస్తులు, డిమాండ్ భారీగా పెరిగింది. అయినప్పటికీ అర్హులైన పేదలకు, ముఖ్యంగా గ్రామాల్లోని అత్యంత నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా స్థానిక నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

 

వచ్చే దీపావళి నాటికి మొదటి విడతలో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు, రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియను కూడా పూర్తి చేసి కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పించేలా కృషి చేస్తాం. ప్రతి లబ్ధిదారుడు త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని సొంతింట్లో సంతోషంగా జీవించాలి.

 

రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.