వీహెచ్ నివాసం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు
అంబర్‌పేట, వెలుతురు, నవంబర్ 08 : అంబర్‌పేటలోని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు నివాసంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వి. హనుమంతరావు నివాసం వద్ద బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని వి. హనుమంతరావు కోరుకున్నారు.
ఈ సందర్భంగా వి. హనుమంతరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఓబీసీ వ్యతిరేక విధానాలను విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కులగణనలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు ప్రత్యేక కాలమ్‌ను కూడా పొందుపరచాలని, అప్పుడే ఆయా వర్గాల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన వివరాలు లభిస్తాయని పేర్కొన్నారు. కులగణన ద్వారా బీసీలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న వివిధ కార్పొరేషన్ల భర్తీలలో గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి ఉద్యమాలు చేసిన అంకితభావం కలిగిన నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అర్హత, అనుభవం, పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకొని వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించాలని కోరారు.
గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై నమోదైన కేసులను సమీక్షించి, వాటిని తొలగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తగిన గౌరవం, గుర్తింపు లభించినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని వి. హనుమంతరావు అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
