భారత్ సమ్మిట్‌తో ప్రపంచానికి తెలంగాణా ప్రగతి, విధానాల పరిచయం
హైదరాబాద్, నవంబర్ 13: రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదని, ఆయన ప్రపంచ స్థాయి నాయకుడని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భారత్ సమ్మిట్‌లో ఆయన పాల్గొనడంపై బీజేపీ నేతలు విమర్శలు చేయడం వారి అక్కసు, కడుపుమంటకు నిదర్శనమని మండిపడ్డారు. శుక్రవారం హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల పరిరక్షణకు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పోరాడుతోందన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీని సమ్మిట్‌కు ఆహ్వానించడాన్ని కూడా రాజకీయం చేయడం బీజేపీ నేతల దివాళాకోరుతనమని విమర్శించారు.
గిగ్ వర్కర్ల సంక్షేమం, భద్రత కోసం చట్టం తీసుకొచ్చిన కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని, వారి కార్యక్రమంలో పాల్గొని రాహుల్ గాంధీ మార్గనిర్దేశం చేస్తారని తెలిపారు. స్వయం ఉపాధితో జీవిస్తున్న యువత పట్ల బీజేపీ నేతలు చిన్నచూపు ప్రదర్శించడం సరికాదన్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబాలకు పదవుల కంటే దేశ అభ్యున్నతే ముఖ్యమని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని బీజేపీకి త్యాగాల విలువ ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.
దేశ ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, హిందూ–ముస్లిం రాజకీయాలు ఇక పనిచేయవని శ్రీధర్‌బాబు అన్నారు. యువత ఆకాంక్షలను అణచివేయాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని, రాబోయే ఎన్నికల్లో దేశంలో అధికార మార్పిడి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రపంచంలోని వివిధ దేశాల విధాన రూపకర్తలు, రాజకీయ నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు పాల్గొంటున్న భారత్ సమ్మిట్ అంతర్జాతీయ స్థాయి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతిని పురస్కరించుకుని ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
