ట్రక్ పార్క్ భూముల వేలాన్ని అడ్డుకుంటాం : హరీశ్‌రావు హెచ్చరిక
హైదరాబాద్, నవంబర్ 13: ప్రజా అవసరాల కోసం కేటాయించిన కూకట్‌పల్లి నియోజకవర్గం మూసాపేట ట్రక్ పార్క్ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి ట్రక్ పార్క్ స్థలాన్ని పరిశీలించి, స్థానిక ప్రజలు, లారీ కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని మాట్లాడారు.
1982లో పేద రైతుల నుంచి ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన ఈ భూములను ఇళ్లు, వ్యాపార అవసరాలకు వినియోగించరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భూములను కాపాడటమే కాకుండా నర్సరీ, పోలీస్ స్టేషన్, ఆర్టీఓ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వంటి ప్రజా అవసరాలకు వినియోగించామని తెలిపారు. ప్రస్తుతం వాటిని కూడా వేలానికి పెట్టడం దుర్మార్గమని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, ఇప్పటికే రూ.26 వేల కోట్ల భూములను విక్రయించిందని ఆరోపించారు. హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ట్రక్ పార్క్ భూముల వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే న్యాయపోరాటంతో పాటు ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. వేలంలో భూములు కొనుగోలు చేసినా భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుని ప్రజా అవసరాలకే వినియోగిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.
