జపాన్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఇగాయ్ యుకాతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భేటీ
హైదరాబాద్, వెలుతురు , నవంబర్ 15 : జపాన్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఇగాయ్ యుకాతో భోంగిర్ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి నేడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భారత్–జపాన్ ద్వైపాక్షిక సహకారంపై విస్తృతంగా చర్చించారు.
2025 ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జపాన్‌లోని కిటాక్యూషు, హిరోషిమా నగరాల్లో పర్యటించిన సందర్భంగా ప్రతిపాదించిన 86 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో ఎకో టౌన్‌షిప్ అభివృద్ధి, గ్రీన్ కొలాబరేషన్ ఒప్పందం గురించి చర్చించారు.
అలాగే జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు వంటి కీలక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించే అవకాశాలను చర్చించారు.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (HIT)తో విద్యా, నైపుణ్యాభివృద్ధి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై కూడా చర్చ జరిగింది.
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. హెల్త్‌కేర్, కేర్‌గివింగ్, ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్, హాస్పిటాలిటీ, నిర్మాణ రంగాల్లో జపాన్‌లో ఉన్న మానవ వనరుల అవసరాలను తెలంగాణ యువత అందిపుచ్చుకునే అవకాశాలను వివరించారు.
అదేవిధంగా జపాన్‌లో ఉద్యోగాల కోసం అవసరమైన స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్ (SSW) వీసా, టెక్నికల్ ఇంటర్న్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (TITP), ఇతర ప్రొఫెషనల్ వర్క్ వీసాలు, నైపుణ్య పరీక్షలు, జపనీస్ భాషలో JFT-Basic, JLPT N4 వంటి అర్హతలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పెట్టుబడులు, పర్యావరణహిత అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, విద్యా భాగస్వామ్యాలు, యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కల్పన ద్వారా తెలంగాణ–జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి.
