సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు
సిద్దిపేట, వెలుతురు, నవంబర్ 18 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అర్ధరాత్రి ముందస్తుగా అరెస్టు చేసి సిద్దిపేట గ్రామీణ పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.
సిద్దిపేటలో నిలిచిపోయిన పశువైద్య కళాశాల, శిల్పారామం, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను ఎప్పుడు పూర్తి చేస్తారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రోడ్లకు కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని ఆరోపించారు. సిద్దిపేట అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది, ఎన్ని ఖర్చు చేసిందో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటని, అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరని హెచ్చరించారు.
ముందస్తుగా అరెస్టయిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోనయ్యగారి ఎల్లం, మాజీ మండల ఉపాధ్యక్షుడు కోనయ్యగారి సంతోష్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డి యాదగిరి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు దండు ప్రభాకర్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సిద్దిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పడిగే ప్రశాంత్ ముదిరాజ్ ఉన్నారు.
ప్రతిపక్ష నాయకుల అరెస్టులు మానుకొని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
