ఖైరతాబాద్ నియోజకవర్గంలో కొత్త పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 19 : బంజారాహిల్స్‌లోని బంజారా భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు చేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాలను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.68 లక్షల పెన్షన్లు మంజూరు చేసిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని వివరించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, బస్తీ దవాఖానాలను బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
