సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దామోదర

సీఎం సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి దామోదర

 

సిద్దిపేట, వెలుతురు, నవంబర్ 18 :  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు (నవంబర్ 19) సిద్దిపేట జిల్లాలో చేపట్టనున్న పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడంతో పాటు, రూ.544.11 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

 

బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున సభా వేదిక, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సభా ప్రాంగణంలో కుర్చీలు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే వైద్య శిబిరం, అంబులెన్స్‌ల అందుబాటు, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి రాకపోకలు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సభకు వచ్చే ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.