26కు ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల జమ వాయిదా
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 19 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ, కొత్త చేయూత పింఛన్ల నిధుల జమ కార్యక్రమాలను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం సిద్ధిపేటలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలను ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ రెండు కార్యక్రమాలను విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా..
ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ, కొత్త పింఛన్ల నిధుల జమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి ప్రత్యేకంగా చిలకపచ్చ రంగు చీరలను తయారు చేయించింది. ఇప్పటికే చీరలు అన్ని జిల్లాలకు చేరుకున్నాయి.
మరోవైపు కొత్తగా ఎంపికైన 4,63,857 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో చేయూత సామాజిక భద్రతా పింఛన్ల నగదును నేరుగా జమ చేయనున్నారు. వీరిలో 2,77,894 మంది వితంతువులు, 1,00,224 మంది దివ్యాంగులు, 53,844 మంది ఒంటరి మహిళలు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఇప్పటికే కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కూడా పూర్తయింది. ఈ కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సీతక్క పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో దివ్యాదేవరాజన్ను ఆదేశించారు. తేదీ మారడంతో చీరలు, కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు మరో వారం రోజులు వేచి చూడాల్సి వస్తోంది.
