మంత్రి పొన్నంతో మహాలక్ష్మి పథకం, అదనపు బస్సులు, విద్యుత్‌ బస్సులపై చర్చ

మంత్రి పొన్నంతో మహాలక్ష్మి పథకం, అదనపు బస్సులు, విద్యుత్‌ బస్సులపై చర్చ

 

హైదరాబాద్‌, వెలుతురు , నవంబర్ 19 :  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) నూతన వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ఐపీఎస్‌ గురువారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ భేటీలో ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితి, సంస్థ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే అంశాలపై చర్చించారు.

 

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తీరును సమీక్షించారు. మహిళా ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడంపై చర్చించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ బస్సుల సంఖ్యను పెంచడం, అవసరమైన ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటు, కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంపై అభిప్రాయాలు పంచుకున్నారు.

 

ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ప్రయాణికుల ఆక్యుపెన్సీ నిష్పత్తిని పెంచడం, సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలపై చర్చించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సామాన్య ప్రయాణికులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ అనిల్‌కుమార్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీని దేశంలోనే ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.