ఇండియా ఫస్ట్’ అనేదే ప్రాతిపదిక : నరేంద్ర మోదీ 

‘ఇండియా ఫస్ట్’ అనేదే ప్రాతిపదిక : నరేంద్ర మోదీ

 

న్యూఢిల్లీ, వెలుతురు, నవంబర్ 19 :  భారత్‌ను స్వయం సమృద్ధి దేశంగా తీర్చిదిద్దడంలో పరిశ్రమల పాత్ర ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే 20 ఏళ్లలో ప్రతి దీర్ఘకాలిక పెట్టుబడి నిర్ణయంలోనూ ‘ఇండియా ఫస్ట్’ అనేదే ప్రాతిపదికగా ఉండాలని పారిశ్రామిక రంగానికి సూచించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పెట్టుబడులు గణనీయంగా పెంచాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి ఇంకా ఎలాంటి సంస్కరణలు అవసరమో ఎలాంటి సంకోచం లేకుండా తనకు నేరుగా తెలియజేయాలని పరిశ్రమల ప్రతినిధులను కోరారు. దిల్లీలో జరిగిన ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశం, వార్షిక సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. భారత్ 2047 లక్ష్యంగా దేశ ఆర్థికాభివృద్ధి, పరిశ్రమల వృద్ధి, అంతర్జాతీయ పోటీలో భారత స్థానం వంటి అంశాలపై మాట్లాడారు. పరిశ్రమలు, రైతులు, చిన్న వ్యాపారులు, సంపద సృష్టికర్తలు, పన్నులు చెల్లించే వారిని గౌరవించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. దేశీ వస్తువుల వినియోగం, స్వయం సమృద్ధి గురించి మహాత్మాగాంధీ 1930లో ఇచ్చిన సందేశాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. దాదాపు వందేళ్లు గడిచినా దేశం ఇంకా అదే సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. పారిశ్రామిక రంగం స్వదేశీ ఉత్పత్తులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వందేళ్ల క్రితమే గాంధీజీ స్వదేశీ, స్వయం సమృద్ధి గురించి చెప్పారని, ఇప్పటికీ తాను అదే విషయాన్ని చెప్పాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. పరిశ్రమలు ఈ దిశగా మరింత వేగంగా అడుగులు వేయాలని కోరారు. దేశీయంగా తయారయ్యే వస్తువుల నాణ్యతను పెంచి, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.