మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ ప్రారంభించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 19 : హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్య పరిరక్షణ, అంటువ్యాధుల గుర్తింపు, నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (ఎంఎస్యూ)ను ఏర్పాటు చేశారు. గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విభాగాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీలోని జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ)కు చెందిన సమగ్ర వ్యాధి నిఘా కార్యక్రమం (ఐడీఎస్పీ) సంయుక్త సంచాలకులు డాక్టర్ శుభాంగి కులసంగే పాల్గొన్నారు.
నగరంలో వ్యాధుల వ్యాప్తిని ఎప్పటికప్పుడు గుర్తించడం, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం ఈ విభాగం ప్రధాన లక్ష్యాలు. సమగ్ర వ్యాధి నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వ్యాధుల నియంత్రణకు అవసరమైన సమాచారాన్ని సేకరించి, సంబంధిత విభాగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఎంఎస్యూ దోహదపడనుంది.
హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యం, సంక్షేమాన్ని కాపాడేందుకు జీహెచ్ఎంసీ సంస్థాగత సమన్వయాన్ని, ప్రజారోగ్య స్పందన వ్యవస్థలను మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. అంటువ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ విభాగం కీలకంగా నిలవనుంది.
