రెండురోజుల పాటు తెలంగాణలో ఏఐసీసీ ఇన్చార్జ్ సందీప్ పర్యటన
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 20 : ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ సందీప్ ఈ నెల 22, 23 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ నెల 22న ఉదయం గాంధీభవన్లో జరిగే పీఏసీ, టీపీసీసీ సలహా కమిటీ ఉమ్మడి సమావేశంలో సందీప్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం నిర్వహించనున్న టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకానున్నారు. 23వ తేదీ ఉదయం గాంధీభవన్లో రాష్ట్ర మంత్రులతో సందీప్ విడివిడిగా వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం నుంచి డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో వ్యక్తిగతంగా సమావేశమై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా, ఏఐసీసీ ఇన్చార్జ్ సందీప్ ఈ నెల 27న మరోసారి తెలంగాణకు రానున్నారు. ఆ రోజు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో వన్ టు వన్ సమావేశాలు నిర్వహించనున్నారు. వరుస సమావేశాల ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, పార్టీ నాయకుల అభిప్రాయాలు, సంస్థాగత అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
